||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది ఏడవ సర్గ ||

||"సీతాం కుశలాం సమగ్రాం"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
అరువది ఏడవ సర్గ
"సీతాం కుశలాం సమగ్రాం"

"సీతాం కుశలాం" అంటే
"సీతమ్మ కుశలముగా వున్నది" అని
అది 'నా సమగ్రమైన మాటల ద్వారా నీకు విదితమే"
అని హనుమ రామచంద్రునికి చెప్పినమాట.

మధురమైన,
మధురమైన మాటలు గల,
దూరముగా వున్నా నాపై ప్రేమగల,
"నా భామిని" ఎలాగ ఉందో చెప్పమని అడిగిన
రామచంద్రుని మాటలకు సమాధానముగా
"సీతావృత్తాంత కోవిదుడు" అంటే హనుమ
మళ్ళీ అంతా చెప్పి చివరిలో ఈ మాట చెపుతాడు.
"నా సమగ్రమైన మాటల ద్వారా
సీతమ్మ కుశలమే అని తెలుసుకొనుము" అని.

ఈ సారి హనుమ
చిత్రకూటములో జరిగిన వాయస వృత్తాంతము
సీత మాటలలో వివరిస్తాడు.
వాయస వృత్తాంతము చెప్పి,
మళ్ళీ సీతమాటలలో
సీత అడిగిన ప్రశ్నలన్నిచెపుతాడు.
తను ఇచ్చిన ఆశ్వాస కూడా చెపుతాడు.

ఇప్పుడు ఆ రాఘవునిచేత ఆవిధముగా అడగబడిన హనుమంతుడు
చెప్పిన మాటలు విందాము.
హనుమ రాములవారికి నివేదిస్తున్నాడు.

'ఓ పురుషోత్తమా ! దేవి జానకి పూర్వము చిత్రకూటములో జరిగిన వృత్తాంతము
నీకు గుర్తుగా ఈ విధముగా చెప్పెను'.

'ఓకప్పుడు నీ దగ్గర సుఖముగా నిద్రించి వున్న సీత
నీకన్న ముందు మేల్కొనెను.
అప్పుడు ఒక వాయసము ఆమె స్తనముల మధ్య పొడెచెను'.

'భరతాగ్రజుడవైన ఓ రామా! ఆ తరువాత నీవు దేవి అంకములో నిద్రపోయితివట.
ఆ పక్షి మళ్ళీ వచ్చి ఆ దేవికి బాధ కలిగించెను.
అపక్షి మళ్ళీ మళ్ళీ వచ్చి బాధించెను.
అప్పుడు నువ్వు ఆ గాయమునుండి కారిన రక్తపు చుక్కలతో మేల్కొన్నావట.
శత్రువులను తపించు ఓ రామా! ఆ వాయసము చేత మళ్ళీ మళ్ళీ బాధించ బడడముతో
ఆ దేవి సుఖముగా నిద్రించుచున్న నీకు చెప్పినదట'.

'ఓ మహాబాహో ! స్తనముల మధ్యలో గీరబడి వున్న ఆమెను చూచి
కోపముతో రెచ్చిపోయిన పాములా బుసలు కొడుతూ నీవు ఇట్లు చెప్పితివట.
" ఓ భయస్థురాలా !నీ స్తనముల మధ్యలో ఎవరు తమ గోళ్ళతో గీకిరి?
రోషముతో నిండిన ఐదు తలల పాముతో ఎవరు ఆటలాడ గోరుచున్నారు?" అని'.

'అప్పుడు అలా నిరీక్షించి తీక్షణమైన గోళ్లతో ఎదురుగా వున్న వాయసమును చూచితివట.
పక్షులలో శ్రేష్ఠుడు అగు ఆ వాయసము ఇంద్రుని పుత్రుడట,
శీఘ్రముగా పోవు అతడు వాయుసమానుడు.
అతడు వెంటనే భూగర్భములో కి పోయెను'.

'ఓ మహాబాహో , బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు రామా !
అప్పుడు కోపము చిమ్ముతున్న కళ్లతో
ఆ క్షణములో ఆ వాయసముపై శిక్షవిధించుటకు ఆలోచించితివిట.
అప్పుడు దర్భాసనము నుండి ఒక దర్బను తీసుకొని,
దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించివట'.

'అది కాలాగ్నివలె జ్వలిస్తూ ఆ పక్షి అభిముఖముగా ప్రజ్వరిల్లినదట.
ఆ ప్రజ్వలిస్తున్న ఆ దర్భను ఆ వాయసముపై ప్రయోగించితివట.
అప్పుడు ఆ జ్వలిస్తున్న ఆ దర్భ ఆ వాయసము వెంట బడెను'.

'ఆ వాయసము తండ్రి చేత సురలచేత మహర్షిభిల చేత వదిలివేయబడినవాడై
మూడు లోకములను తిరిగినా రక్షైంచువాడు లభించలేదట.
ఓ అరిందమ ! భయముతో మళ్ళీ నీదగ్గరకే శరణు కోసము వచ్చెను'.

'ఆ వాయసము కాకుత్‍స్థుని శరణుకై వచ్చి భూమి మీద పడినప్పుడు,
అది వధించుటకు తగినది అయినా నువ్వు దయతోరక్షించితివిట.
ఓ రాఘవా! ఆ అస్త్రమును వ్యర్థము చేయుటకు వీలు లేక
ఆ ఆస్త్రముతో ఆ వాయసముయొక్క దక్షిణ నేత్రమును తీసుకొనబడినదిట.
ఓ రామా అప్పుడు ఆ వాయసము నీకు
అదేవిధముగా మహారాజు దశరథునకు నమస్కరించి
తన ఆలయమునకు పోయెనట'.

హనుమంతుడు సీత చెప్పిన మాటలు ఇంకా చెప్పసాగెను.

"శీలవంతుడైన రాఘవుడు
అస్త్రవేత్తలలో శ్రేష్థుడు, సత్యవంతుడు, బలవంతుడు అయికూడా
ఆ రాక్షసులమీద ఎందుకు అస్త్రములు ప్రయోగించడు?".

"రణములో రాముని ఎదురుకొనుటకు
నాగులు సురులు మరుద్గణములు గాని,
గంధర్వులు కాని సమర్థులు కారు కదా".

"వీరోత్తము డైన ఆయనకి నాగురించి కించుత్తు సంభ్రమము అయితే
సునిశితమైన బాణములతో
రావణుని యుద్ధములో రావణుని అంతమొనర్చవలెను కదా".

"పరంతపుడు నరులలో శ్రేష్ఠుడైన రాఘవుడు,
లేక అన్నగారి ఆదేశము తీసుకొని లక్ష్మణుడు కాని
నన్ను ఎందుకు రక్షించరు?
వాయువు అగ్ని తో సమానమైన తేజస్సు శక్తి కల ఆ పురుష వ్యాఘ్రులు,
దేవతలకు కూడా లొంగని వారు,
నాపై ఎందుకు ఉపేక్షించుచున్నారు?"

"నాచేత ఏదో మహత్తరమైన దుష్కృతమైనది.
సందేహము లేదు.
అందువలనే సమర్థులైనా ఆ పరంతపులు
నన్ను నిర్లక్ష్యము చేయుచున్నారు".

'కన్నీరుకార్చుతూ చెప్పిన దీనమైన ఆమె మాటలను విని
నేను కూడా మళ్ళీ ఆ పూజ్యురాలికి ఇట్లు చెప్పితిని.

"ఓ దేవీ రాముడు నీ పై శోకముతో అన్ని విషయములలో విముఖుడు.
నీకు సత్యము చెప్పుచున్నాను.
రాముడు దుఃఖములో ఉండుటవలన లక్ష్మణుడు కూడా పరితపిస్తున్నాడు.
ఓ పూజ్యురాలా ఎలాగో అదృష్టము కొలదీ నీవు కనపడితివి.
చింతించుటకు సమయము కాదు.
ఈ ముహూర్తమే దుఃఖముల అంతము చూచుచున్నావు".

"ఆ నరశార్దూలములు ఇద్దరూ, నిందించతగని మహాబలులు.
ఆ రాజపుత్రులు ఇద్దరూ నీ దర్శనమునకు కల ఉత్సాహముతో
లంకను భస్మము చేసెదరు.
ఓ సీతా ! రౌద్రుడైన రాఘవుడు
రావణుని బంధువులతో కలిపి సమరములో హతమార్చి
నిన్ను తన పురమునకు తప్పక తీసుకుపోవును.
ఓ దేవీ రామునికి ఏది తెలుసునో అది
అతని ప్రేమను ప్రతిబింబించు గురుతును నాకు చెప్పుము".

'ఓ మహాబలా అప్పుడు ఆమె అన్ని దిశలు పరికించి
తలలో ఉన్న ఈ ఉత్తమమైన మణిని నాకు ఇచ్చినది'.

'ఓ రఘురామా! ఈ దివ్యమైన మణిని నీ కోసమై తీసుకొని
పూజనీయురాలైన ఆమెకి నమస్కరించి
నేను తిరిగివచ్చుటకు సిద్ధమైతిని.
మంచివన్నెకల జనకాత్మజ,
తిరుగుప్రయాణముయొక్క ఉత్సాహములో పెరుగుచున్ననన్ను చూచి
ఆమె మరల కళ్ళనీళ్లతో నిండిన ముఖముతో,
భాష్పముల వలన కలిగిన గద్గద స్వరముతో ఇట్లు చెప్పెను'.

"ఓ హనుమా ! సింహాస్వరూపులైన ఆ రామలక్ష్మణులిద్దరిని
సుగ్రీవుని అతని అమాత్యులందరినీ అడిగినట్లు చెప్పుము.
మహాబాహువులు కల ఆ రాఘవుడు
ఈ దుఃఖసాగరమునుంచి నన్ను ఏవిధముగా రక్షించునో
అది నువ్వు చూడుము".

"ఓ వానరోత్తమా ! రాముని వద్దకు పోయి
నా ఈ తీవ్రమైన శోకము గురించి
రాక్షసులచేత భయపెట్టబడుతున్న విషయమును చెప్పుము.
నీ ప్రయాణము శుభము అగు గాక".

'ఓ మహారాజా ! పూజ్యనీయురాలైన సీత
విషాదముతో కూడిన ఈ మాటలను నీకు చెప్పమంది.
నా చేత చెప్పబడిన ఈ సమగ్రమైన మాటలతో
సీత కుశలము గా వున్నదని గ్రహించిఉంటావు'.

ఈ విధముగా హనుమంతుడు
సీతతో జరిగిన తన సంభాషణలను
రామలక్ష్మణులకు వివరించెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||